Monday 11 April 2016

మర్యాద రామన్న: ఉచితం – unఉచితం



          ఒకరోజు మర్యాద రామన్న తన ఆఫీసులో ఉండగా ఆయన దగ్గరకు న్యాయం కోసం నవతేజ, శివతేజ అనబడే ఇద్దరు స్నేహితులు వచ్చారు. రామన్నకు వారితో అంతకు ముందే పరిచయమున్నది. వారిద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు. గాఢమైన వారి స్నేహానికి ఆటంకం కలిగించిన ఆ సమస్య ఏమిటో అని రామన్నకు ఉత్సుకత కలిగింది.
రామన్న అడుగగా ఆ స్నేహితులు వారి సమస్య ఈ విధంగా చెప్పుకొచ్చారు. శివతేజ చెప్పాడు రామన్నగారు, మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. నిన్న శెలవు తీసుకుని ప్యాట్నీలోని దుకాణాల్లో నా బట్టల షాపింగ్ చేద్దామని మధ్యాహ్నం బయలుదేరబోతుంటే నవా (నవతేజ) ఇంటిబయట కలిశాడు. ఎక్కడికి బయలుదేరావ్? అని అడగ్గా విషయం చెప్పాను. తను ఖాళీగా ఉండటంతో నాతోపాటు రమ్మని అడిగాను. ఇద్దరం కలిసి వెళ్ళాం. అంత దూరం వచ్చి ఖాళీచేతులతో తిరిగి వెళ్ళడం ఎందుకని తనని కూడా ఒక చొక్కా తీసుకోమన్నాను. ఇద్దరం చెరొకటి తీసుకున్నాం. బిల్లింగ్ కౌంటర్ దగ్గర డబ్బులు కడుతుండగా దుకాణదారుడు మూడో చొక్కా ఏదని అడిగాడు.
          ఇది పండుగ సీజన్. అన్ని దుకాణాల్లో రకరకాల ఆఫర్లు పెట్టి విక్రయిస్తున్నారు. అలాగే ఆ దుకాణంలో కూడా సంక్రాంతి ఆఫర్ పెట్టారు. అదేంటంటే రెండు చొక్కాలు కొంటే అదనంగా ఒకటి ఉచితం అని. ఈ విషయం నాకు, నవాకు ముందుగా తెలియదు. వాడు తన వాటా డబ్బులు ఇచ్చి బిల్లు తీసుకో, నేను వెళ్ళి ఒక మంచి చొక్కా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. నేను అలానే చేశాను. వాడు తిరిగొచ్చాక మొత్తం ప్యాక్ చేయించుకుని ఇంటికి బయలుదేరాము. ఇద్దరం మా ఇంటికి చేరాక కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. కాసేపటి తరువాత నేను ఫోన్లో మాట్లాడుతుండగా నవా హడావిడిగా వెళ్ళిపోయాడు.
ఇవాళ ఉదయం కొత్తబట్టలు మా ఆవిడకి చూపించుదామని కవర్ తీస్తే అందులో ఒక్క చొక్కానే ఉంది. అప్పుడర్థమయ్యింది, నవా వెళ్తూ రెండు తీసుకున్నాడని, ఆ సమయంలో నేను ఫోన్లో మాట్లాడుతూ ఈ విషయం గమనించలేదని. వెంటనే బయలుదేరి వాడి ఇంటికి వెళ్ళి నిలదీశాను.
ఇంతలో నవా కలుగజేసుకుని రామన్నగారు, నేను రెండు చొక్కాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ నేను వెళ్ళకపోయుంటే ఆ మూడో చొక్కా ఉచితంగా వచ్చేది కాదు. నేను వెళ్ళటం వల్లనే అది వచ్చింది కాబట్టి న్యాయపరంగా అది  నాకే చెందాలి. అందుకే ఆ చొక్కా తీసుకున్నాను. నేను బయలుదేరేటప్పుడు శివా (శివతేజ) ఫోన్లో మాట్లాడుతున్నాడు, అందువల్ల చెప్పడం కుదరలేదు. ఇవాళ ఉదయం నేను వాడికి ఫోన్ చేయ్యబోతుంటే ఇంతలో వాడే వచ్చేశాడు. మీరు న్యాయసంపన్నులు. మీరైనా ఇదే తీర్పు ఇస్తారు, ఎందుకంటే న్యాయం నా పక్షాన ఉంది అని ముగించాడు.
రామన్న శివాని తన వాదన వినిపించమన్నాడు. అప్పుడు శివా ఇలా చెప్పుకొచ్చాడు ఆ విధంగా చూస్తే అసలు నేను పిలవకుంటే వాడు దుకాణానికి వచ్చేవాడే కాదు, చొక్కా కొనేవాడే కాదు, ఆ మూడో చొక్కా వచ్చేదే కాదు. నావల్లనే ఆ మూడోది వచ్చింది కాబట్టి న్యాయపరంగా అది నాకే చెందాలి.  ఇది చెప్తుంటే వాడికి తలకెక్కటం లేదు. ఉదయం నుంచి ఇదే వాదన. ఇటువంటి క్లిష్టమైన తగవులు తీర్చడంలో ఈ చుట్టుపక్కల తమను మించినవారు లేరు. తమరంటే మా ఇద్దరికీ గౌరవం. తమరి తీర్పు మీద మా ఇద్దరికీ అపారమైన నమ్మకం ఉంది. అందుకే తమరి వద్దకు వచ్చాం. ఎలాగైనా తమరే మా తగవు తీర్చాలి.
వారిద్దరి వాదనలు విన్నాక రామన్నకు ఇటువంటిదే అంతకు పూర్వం జరిగిన ఒక సంఘటన గుర్తుకువచ్చింది. ఇక్కడ ఆ అదనపు చొక్కా ఎవరికి చెందాలో నిర్ణయించాలి, ఆ సంఘటనలో ఒక ఆవు అది నాది అని వాదిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిదో నిర్ణయించాలి. అప్పుడు తను ఆ ఆవును రెండు సమాన భాగాలుగా విభజించి ఆ ఇద్దరికీ పంచమని తీర్పు ఇచ్చాడు. దాంతో ఆ ఆవు అసలు యజమాని కళ్ళనీళ్ళ పర్యంతమై నా గంగ (ఆవు) ని ఆయనకే ఇచ్చేయండి సామీ, కనీసం బతికైనా ఉంటది. నా కడుపు నింపుకోవడం కోసం నాకిన్నాళ్ళూ పాలిచ్చిన గోమాతను సంపేంత కసాయోడిని కాదు సామీ నేను అంటూ విలపించాడు. ఆ విధంగా అసలు యజమానిని కనిపెట్టి, అతనికి ఆవుని అప్పజెప్పి, మోసం చెయ్యటానికి ప్రయత్నించిన ఆసామికి జరిమానా విధించి, వచ్చిన పైకాన్ని తిరిగి తిండికి గతిలేక ఇబ్బంది పడుతున్న అసలు యజమానికి ఇచ్చేశాడు రామన్న. అదే ఉపాయాన్ని ఇప్పుడు కూడా వాడదలుచుకున్నాడు.
రామన్న వారిద్దరివైపు చూసి సమస్య కొంచెం క్లిష్టమైనదే. మీరిరువురి వాదనల్లో నిజం ఉంది. దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆ చొక్కాని రెండు భాగాలు చేసి ఇద్దరు పంచుకోండి అని తీర్పు చెప్పాడు. దానికి వారిద్దరూ అంగీకరించారు. తన తీర్పుకి వారి స్పందన రామన్న అనుకున్నట్టుగానే వచ్చింది. ఈ తీర్పు ద్వారా వారిద్దరి మధ్య పంతం ఎంతో అంచనా వేయవచ్చని అతని ఆలోచన. కానీ ఆ చొక్కాని ముక్కలు చేయడం అంటే ధనం మరియు వనరులను వ్యర్ధం చేయడమే. అది రామన్నకు ఇష్టం లేదు. అందుకే మరో ఉపాయం ఆలోచించసాగాడు. స్నేహంతో వచ్చిన చిక్కు ఇదే. అది ఎంత గాఢంగా ఉంటుందో, సందర్భం వస్తే క్షణాల్లో అంతే వైరంగా మారిపోతుంది.
రామన్న అలా కొంతసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. నవా, శివా బాక్సింగ్ రింగ్ లో ఎదురెదురుగా కూర్చుని, గంట మ్రోగడంకోసం ఎదురు చూస్తున ప్రత్యర్థుల్లాగా ఉన్నారు. వారిద్దరి మధ్య ఉద్రిక్తతను గమనించిన రామన్న ఇలా అన్నాడు, నేను ఈ సమస్యకు మరో పరిష్కారం ఆలోచిస్తాను. దానికి ముందు మీరిద్దరూ నేను చెప్పినట్టు చెయ్యండి. ఎటూ భోజనవేళయింది కాబట్టి మీరిద్దరూ కలిసివెళ్ళి, ఈ వీధి చివర ఒక హోటల్ ఉంది, అక్కడ భోజనం చేసి రండి.
*  *  *
ఆ ముగ్గురూ రెండు గంటల తరువాత కలిశారు. రామన్న వాళ్ళను కూర్చోబెట్టి తన తీర్పు చెప్పాడు నవా చెప్పినట్టు అతను రాకపోయుంటే  ఆ మూడవ చొక్కా ఉచితంగా వచ్చేదే కాదు. కానీ శివా చెప్పిన దాంట్లో కూడా వాస్తవముంది, అతను నవాను పిలవకపోయుంటే  కూడా అది మీకు దక్కేది కాదు. కానీ మీరిద్దరూ ఇంకో విషయం మరచారు. ఆ దుకాణం వాడు ఆ ఆఫర్ పెట్టి ఉండకపోయినట్లయితే అసలు ఇదంతా జరిగి ఉండేది కాదు. కాబట్టి ఆ చొక్కాను తిరిగి దుకాణంలో ఇచ్చేయవలసిందిగా తీర్పునిస్తున్నాను.
నవా, శివా ఈ తీర్పుకి విస్తుపోయారు. నవా కోపంతో మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా అర్ధమవుతుందా? చొక్కాను తిరిగిచ్చేయటమేంటి? ఏదో మర్యాద గల వ్యక్తి, న్యాయం చెప్తారని వస్తే ఇలా మాట్లాడతారేంటి? అంటూ ఆవేశంగా మాట్లాడసాగాడు. కానీ శివా మాత్రం చాలా శాంతంగా దాన్ని నవాకే ఇచ్చేయండి అన్నాడు. నవా ఆశ్చర్యంతో శివా వైపు, పిమ్మట రామన్న వైపు చూశాడు. రామన్న అంతా తను అనుకున్నట్టే జరుగుతుందన్నట్టు చిద్విలాసుడై చూస్తూ ఉన్నాడు.
రామన్న నవాకు ఏం జరిగిందో ఇలా వివరించాడు మీ సమస్య వినగానే నాకనిపించింది ఏమంటే నేను తీర్పు ఎవరి పక్షాన ఇచ్చినా మీ ఇద్దరి మధ్య స్నేహం దెబ్బతింటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవలసింది మీలో ఒకరై ఉండాలి. అసలు ఇంత గాఢమైన స్నేహితుల మధ్య ఈ తగవుకు కారణమేమై ఉంటుందా అని ఆలోచించాను. నిన్ను కొంతసేపు గమనించిన తరువాత నీ ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేదని గ్రహించాను. తనకు చెప్పకుండా చొక్కాను తీసుకెళ్ళిపోయిందుకు శివాకు ఆగ్రహం వచ్చింది తప్పా తనకు నష్టం వచ్చినందుకు కాదు. నీ పరిస్థితిని అతనికి వివరిస్తే అతనే మనస్పూర్తిగా ఆ చొక్కాను నీకు ఇచ్చేస్తాడు.
అందుకోసమే మీ ఇద్దరినీ కలిపి ఆ హోటల్ కు పంపాను. దాని యజమాని నా స్నేహితుడు. మీరు బయలుదేరగానే అతనికి ఫోన్ చేసి, మీ విషయం చెప్పి, అతని సహాయం కోరాను. అతను అంగీకరించాడు. అతన్ని మీ బిల్లు రెండింతలు పెంచి చెప్పమన్నాను. డబ్బు ఖర్చుచేయటంలో వెనుకాడని నువ్వు భోజనం బిల్లు కట్టడానికి జంకడం నీ స్నేహితుడు గమనించాడు. ఆ తరువాత అంతా అనుకున్నట్టుగానే జరిగింది.
నవా సిగ్గుతో తలవంచుకున్నాడు. శివా అతని భుజంపై చెయ్యివేసి నన్ను క్షమించు మిత్రమా! నీ గురించి తెలిసినా కూడా నువ్వు ఇలా ఎందుకు చేశావా అని ఆలోచించలేదు. ఇంకెప్పుడూ ఇలా జరుగదు అన్నాడు. నవా తలవంచుకునే చిన్నప్పటి నుంచి మనం కలిసి ఉన్నా, నా కష్టాలను నీకు చెప్పుకుంటే నన్ను చులకనగా చూస్తావేమోనని భయపడ్డాను. నిన్ను తప్పుగా అంచనా వేసినందుకు క్షమించు మిత్రమా! అని బదులుగా అన్నాడు.
ఏ బంధంలోనైనా అడపా దడపా అపార్ధాలు వస్తుంటాయి, అలాంటప్పుడు వాటి కారణాలను తెలుసుకుని నివృత్తి చేసుకోవాలి తప్పా అగాథాలు తవ్వుకోకూడదు అంటూ నీతిబోధ చేసి మర్యాద రామన్న వారిద్దరినీ సాగనంపాడు.